![]() |
శ్రీ మహాగణపతయే నమః |
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్
![]() |
శ్రీ సరస్వత్యై నమః |
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబునందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!
****
తేనెలొలికే భాష మన తెలుగు భాష. సరళమై, సుందరమైన మన తెలుగులో అవధానం వంటి ప్రక్రియలున్నాయి. రెండర్ధాలను సూచించే శ్లేష కూడ తెలుగు సొంతం. మధురమైన తెలుగు భాష గుఱించి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగరాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ విధంగా అన్నాడు -
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!
మన సంస్కృతి తో పాటు మన భాషను ప్రోత్సహించి, పరిరక్షించుకోవలసిన బాధ్యతా మనపై వుంది. అయితే మన దైనందిన జీవితంలో పర భాష నడుమ ఉద్యోగము చేస్తూ మనదైన తెలుగును నిలబెట్టుకోవడం కోసం ఎందరో తల్లిదండ్రులు తల్లకిందులు అవుతున్నారు. తమ పిల్లలకు తెలుగు నేర్పాలని వున్నా సమయం చిక్కక, సమయం చిక్కినా సరైన పాఠ్యాంశములు అందుబాటులో లేక నేర్పించాలనే తపన వున్నా, నేర్పలేక సతమతమవుతున్నారు. అటువంటి వారికి సులభంగా అర్ధమయేలా ఒక వేదికను రూపొందించాలనే తపన ఉంది. ప్రవాసంలో నివాసం ఏర్పరచుకున్నా తెలుగు భాషపై గల మక్కువ తో సాటి ప్రవాసాంధ్రులకు, వారి పిల్లలకు ఉపయోగపడుతుందనే ఆశయంతో ప్రారంభించిన బ్లాగు "మన తెలుగు". మీకు గల అభిప్రాయాలను, సూచనలను అందించి ఆశీర్వదిస్తారని నా ఆకాంక్ష.
- భవదీయుడు
సూర్యనారాయణ వులిమిరి
నార్త్ కరోలినా, అ.సం.రా.
నార్త్ కరోలినా, అ.సం.రా.